మహిళా క్రికెట్‌కు సరికొత్త చాలెంజ్..
- తొలిసారి ఫ్రాంచైజీ విధానంలో విమెన్ ప్రీమియర్ లీగ్
- వేలంలో నాలుగు జట్లు..
- 80 మంది క్రీడాకారిణుల కొనుగోలు
- రూ.4.30 లక్షలతో పేరేరా హేన్రిట్టాను దక్కించుకున్న గోదావరి గోల్డెన్ ఈగల్స్
విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సరికొత్త అడుగు వేసింది. తొలిసారిగా ఫ్రాంచైజీ విధానంలో విమెన్ ప్రీమియర్ లీగ్–2026 నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా క్రీడాకారిణుల వేలం ప్రక్రియ మంగళవారం విజయవాడలోని నోవాటెల్‌లో ఉత్కంఠభరితంగా జరిగింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు వేలం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాలుగు ఫ్రాంచైజీల మధ్య పోటీ
విమెన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇప్పటికే అత్యధిక బిడ్ ద్వారా అర్హత సాధించిన నాలుగు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొన్నాయి. అమరావతి ఈ ఛాంపియన్స్, రాయలసీమ జెన్ స్టార్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు ప్రతిభ కలిగిన మహిళా క్రికెటర్లను తమ జట్లలోకి తీసుకునేందుకు పోటీపడ్డాయి. వేలం ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
హేన్రిట్టాకు అత్యధిక ధర
వేలంలో పేరేరా హేన్రిట్టాను రూ.4.30 లక్షలకు గోదావరి గోల్డెన్ ఈగల్స్ సొంతం చేసుకుంది. భారత స్టార్ క్రీడాకారిణి శ్రీ చరణిని రూ.1.10 లక్షలకు రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు కొనుగోలు చేసింది. మొత్తం 191 మంది మహిళా క్రికెటర్లు వేలం కోసం నమోదు చేసుకోగా, వారిలో 80 మంది క్రీడాకారిణులు నాలుగు ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు.
మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు
రాష్ట్రంలోని మహిళా క్రికెట్ క్రీడాకారిణులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, వారి ప్రతిభను వెలికితీసేందుకు ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఫ్రాంచైజీ విధానంలో లీగ్ నిర్వహించడం వల్ల మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ఈ లీగ్‌లో ప్రతిభ కనబరిచే క్రీడాకారిణులకు భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు దక్కుతాయని, జాతీయ స్థాయి జట్లలో చోటు సంపాదించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లీగ్ నిర్వహణకు ముందుకు వచ్చిన ఫ్రాంచైజీ యాజమాన్యాలను అభినందించారు.
మంగళగిరి స్టేడియంలో మ్యాచ్‌లు
విమెన్ ప్రీమియర్ లీగ్–2026లోని అన్ని మ్యాచ్‌లను మంగళగిరి స్టేడియంలో నిర్వహించనున్నట్లు సుజయ్ కృష్ణ రంగారావు వెల్లడించారు. పురుషుల ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు విశేష స్పందన లభించిందని, విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికల్లో జరిగిన మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని గుర్తుచేశారు.
అదే తరహాలో మహిళా ప్రీమియర్ లీగ్‌కు కూడా క్రీడాభిమానులు ఆదరణ అందించాలని ఆయన కోరారు. మహిళా క్రికెట్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణులను తీర్చిదిద్దడమే ఏసీఏ లక్ష్యమని తెలిపారు.



