Nepal Flash Floods |నేపాల్‌ వరదల్లో10 రోజులు సొరంగంలోనే..  చివరికి ప్రాణాలతో బయటకు..!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: నేపాల్‌లో ఆకస్మిక వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఊహించని రీతిలో ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. పది రోజుల పాటు సొరంగంలో చిక్కుకుపోయి.. ఆహారం, నీరు లేకుండానే ప్రాణాలతో పోరాడిన వారు చివరకు సురక్షితంగా బయటకు వచ్చారు.
నేపాల్‌ను ఇటీవల కుదిపేసిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని మిగిల్చాయి. వరద ఉధృతికి అనేక ప్రాంతాలు నీటమునిగిపోగా, జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఈ క్రమంలో త్రిశూలి నది సమీపంలోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి పది రోజుల తర్వాత ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీర్ సంజయ్ సాహ్, మరో కార్మికుడు కబీర్ మహాజన్ను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

కాపాడాల్సిన వారే.. చివరకు తానే చిక్కుకున్నాడు

వరదలు ఒక్కసారిగా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని ముంచెత్తిన సమయంలో సంజయ్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 40 నుంచి 45 మంది కార్మికులు ఉన్నట్లు ఆయన తెలిపారు. వరద నీరు, బురద, భారీ శిథిలాలు సొరంగంలోకి దూసుకురావడంతో పరిస్థితి క్షణాల్లో ప్రమాదకరంగా మారింది. అక్కడ ఉన్న కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సంజయ్ ప్రయత్నించారు. అయితే ఇతరులను కాపాడే ప్రయత్నంలో చివరకు ఆయనే సొరంగంలో చిక్కుకుపోయారు. “కంట్రోల్ రూమ్ బాధ్యత నాదే. అందరినీ కాపాడాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉందని భావించాను” అని సంజయ్ తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

బయట ప్రపంచంతో సంబంధం లేదు..

సంజయ్, కబీర్ సొరంగం లోపల సుమారు 170 మీటర్ల దూరంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. వారి చుట్టూ కొద్దిమంది మాత్రమే ఉన్నారని సంజయ్ చెప్పారు. అయితే సొరంగం చాలా పొడవుగా ఉండటంతో పవర్‌హౌస్ వైపు మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉండోచ్చని సంజయ్ తెలిపారు.

తిండి లేదు.. నీరు లేదు.. అయినా ఆశ వదల్లేదు..

పది రోజుల పాటు సొరంగంలో చిక్కుకుపోవడం అంటే ఊహించడానికే భయంగా ఉంటుంది. చుట్టూ చీకటి.. బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. తినడానికి ఆహారం లేదు.. తాగడానికి నీరు లేదు. ప్రతి క్షణం ప్రాణాలపై ఆశలు సన్నగిల్లే పరిస్థితి.అయినా సంజయ్ మాత్రం ధైర్యం కోల్పోలేదు.అలాంటి సమయంలో తనకు మానసిక బలాన్ని ఇచ్చింది ‘హరే కృష్ణ మహామంత్రం’ అని ఆయన చెప్పారు.

“ఆ మంత్రాన్నే జపిస్తూ ఉన్నాను”

సొరంగంలో చిక్కుకున్న ఆ పది రోజులూ తాను నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించానని సంజయ్ తెలిపారు.“ఆ సమయం అంతా నేను ఆ మహామంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను. అదే నాకు ధైర్యం ఇచ్చింది. బతకగలననే నమ్మకాన్ని నిలబెట్టింది” అని ఆయన చెప్పారు.చివరకు సహాయక బృందాలు సొరంగంలోకి చేరుకుని సంజయ్, కబీర్‌లను బయటకు తీసుకువచ్చాయి. బురద, చిత్తడితో నిండిన స్థితిలో వారిని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చెప్పకనే చెప్పాయి. పది రోజుల పాటు చీకటిలో ప్రాణాలతో పోరాడి తిరిగి వెలుగులోకి వచ్చిన సంజయ్ కథ.. నేపాల్ వరదల విషాదంలో ఒక ఆశాకిరణంగా నిలిచింది.