Nepal Flash Floods | నేపాల్‌ విపత్తుపై షాకింగ్‌ విషయం.. ముందే కనిపించిన సంకేతాలు

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: హిమాలయ ప్రాంతంలో సంభవించిన ఘోర విపత్తు నేపాల్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆకస్మిక వరదలు సంభవించి వారం రోజులు గడిచినా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 1,127కు చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా వేలాది మంది గల్లంతైనట్లు, వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

నేపాల్ పోలీసుల వివరాల ప్రకారం.. చిత్వాన్‌ ప్రాంతం నుంచి 348 మృతదేహాలను వెలికితీయగా, నవల్పరాసి తూర్పు నుంచి 217, నవల్పరాసి పశ్చిమ నుంచి 190, నువాకోట్‌ నుంచి 155 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ముందే సంకేతాలు..

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో ఈ భారీ వరదలకు కారణమైన హిమానీనదం కూలిపోవడానికి కొన్ని రోజుల ముందే ప్రమాద సూచనలు కనిపించాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరింత మెరుగ్గా ఉండి ఉంటే భారీ ప్రాణనష్టాన్ని నివారించే అవకాశం ఉండేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వరద ప్రవాహం దిగువన ఉన్న జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు మరింత సమర్థవంతమైన విపత్తు సన్నద్ధత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉపగ్రహ చిత్రాల్లో ముందస్తు హెచ్చరికలు..

ఆగస్టు 28న సిద్ధం చేసిన హైరిస్క్‌ నివేదిక ప్రకారం.. విపత్తుకు ముందే ఉపగ్రహ చిత్రాల్లో హిమానీనదం అస్థిరతకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. పరిశీలనలో భాగంగా శాస్త్రవేత్తలు హిమానీనదంలో పలు మార్పులను గుర్తించారు. ఉపగ్రహ చిత్రాల్లో హిమానీనదం ఉపరితలంలో మార్పులు కనిపించాయని, లోపల నీటి కదలికలు వేగంగా పెరుగుతున్నట్లు ఆధారాలు లభించాయని నివేదిక పేర్కొంది. ఆగస్టు 24న తీసిన చిత్రాల్లో కరిగిన నీరు గోధుమ రంగులోకి మారినట్లు గుర్తించారు.

అంతేకాకుండా సమీపంలోని రాతి నేల వాలులోకి ఒక పగులు విస్తరిస్తున్నట్లు పరిశోధకులు గమనించారు. “సంఘటన జరిగిన తర్వాత పరిశీలిస్తే.. విపత్తుకు ముందు కొన్ని సూచనలు కనిపించాయి” అని శాస్త్రవేత్తలు తెలిపారు.

బలహీనంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు..

వెయ్యి మందికి పైగా ప్రాణాలు తీసిన ఈ విపత్తు.. హిమాలయ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థల లోపాలను మరోసారి బయటపెట్టింది. దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, పనిచేస్తున్న కార్మికుల రక్షణ కోసం మరింత పటిష్టమైన వ్యవస్థలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్త, నివేదిక సహ రచయిత జాకబ్‌ స్టీనర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు తగినంత బలంగా లేవని తెలిపారు. ముఖ్యంగా జలవిద్యుత్‌ ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న కార్మికుల కోసం రక్షణ చర్యలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.

తరచూ సంభవిస్తున్న ఇలాంటి ప్రకృతి విపత్తులు.. హిమాలయ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల వద్ద పనిచేసే కార్మికుల కోసం మెరుగైన రక్షణ చర్యలు, ఆధునిక హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.