Nepal Flash Floods | వరదలతో నేపాల్‌కు కోలుకోలేని దెబ్బ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. వరద జనావాసాలపై విరుచుకుపడటంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే మృతుల సంఖ్య 1,003కు చేరగా.. దాదాపు 4 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం కాగా దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు కొత్తగా వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వరద ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఇప్పటివరకు 1,003 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. చిత్వాన్‌లో అత్యధికంగా 321 మరణాలు నమోదయ్యాయి. నవల్పరాసి తూర్పు జిల్లాలో మరో 216 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే అసలు ఆందోళన గల్లంతైన వారి సంఖ్యపైనే ఉంది. సుమారు 4 వేల మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 12 వేల మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
భారీ సహాయక చర్యలు
వరదల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నేపాల్ ప్రభుత్వం భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. గాలింపు, సహాయక చర్యల కోసం 21,300 మందికి పైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. రోడ్డు మార్గాలు తెగిపోవడంతో మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలను అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.
మళ్లీ వరదల ముప్పు..
ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరోవైపు నేపాల్‌కు కొత్త వరదల ముప్పు ఎదురవుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో పలు చోట్ల నదుల నీటిమట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రసువా, నువాకోట్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను ముందుగానే గుర్తించేందుకు నదులపై నిరంతర పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదకర ప్రాంతాల్లో పర్యవేక్షణ కెమెరాలు, ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసే పనులు కూడా చేపడుతోంది.
చైనాతో వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం
వరదల విధ్వంసం నేపాల్ అంతర్గత రవాణాకే పరిమితం కాలేదు. చైనాతో వాణిజ్యానికి కీలకమైన రసువాగఢి సరిహద్దు మార్గం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఉత్తర జిల్లాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినడం వల్ల ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
విపత్తు వేళ మరో సమస్య..
వరదలతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తుంటే.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం మరో రకమైన గందరగోళం నెలకొంది. నేపాల్ వరదలకు సంబంధించినవిగా పేర్కొంటూ పాత వీడియోలు, నకిలీ చిత్రాలు, ఏఐతో రూపొందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటి ద్వారా ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొంటున్నాయి. తప్పుడు సమాచారంపై నేపాల్ ప్రెస్ కౌన్సిల్‌కు ఆన్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు 101 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
