Nepal Flash Floods | నేపాల్లో ఆకస్మిక వరదతో కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు!
- దెబ్బతిన్న జలవిద్యుత్ కేంద్రం
- నలుగురు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం
- సహాయక చర్యలకు హెలికాప్టర్లు.. అప్రమత్తమైన అధికారులు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేపాల్లో ఆకస్మిక వరద మళ్లీ బీభత్సం సృష్టించింది. గోర్ఖా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బుధి గండకి నది పరివాహక ప్రాంతంలో సంభవించిన వరదతో భారీ నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా పోటెత్తిన వరద నీరు, బురద, శిథిలాలు జనావాసాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 35 నుంచి 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మారుమూల ప్రాంతాలను కలిపే పలు వంతెనలు కొట్టుకుపోయాయి. స్థానిక జలవిద్యుత్ కేంద్రానికి కూడా నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదైనట్లు అధికారులు నిర్ధారించలేదు.
ఆదివారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఈ ఆకస్మిక వరద సంభవించింది. గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి, ధార్చే గ్రామీణ మున్సిపాలిటీల పరిధిలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సల్లేరి, పైయున్, జగత్ బాగర్తోపాటు సమీప నివాస ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరింది. నీటి ఉద్ధృతికి ఇళ్లు దెబ్బతినడంతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమీపంలోని వాగుల నుంచి పెద్ద శబ్దాలు వినిపించడంతో ముందుగానే అప్రమత్తమైన కొందరు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
తెగిపోయిన వంతెనలు..
వరద ఉద్ధృతికి మారుమూల గ్రామాలను కలిపే పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. చుమ్నుబ్రి-3 పరిధిలోని న్యాక్చెట్, ఫిలిమ్ బజార్ల మధ్య ఉన్న వేలాడే వంతెన కూడా కొట్టుకుపోయినట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటి ప్రవాహం కారణంగా స్థానిక జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన మౌలిక సదుపాయాలు, పరికరాలు దెబ్బతిన్నాయి. నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యాటకుల తరలింపు
వరద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. అక్కడి హోటళ్లలో బస చేస్తున్న పర్యాటకులను కూడా ప్రమాదకర ప్రాంతాల నుంచి తరలించినట్లు సమాచారం. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. మరోసారి వరదలు సంభవించే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరదకు కారణం కొండచరియలేనా?
ఆకస్మిక వరదకు కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. లోక్పా, చుమ్లింగ్ మధ్య బుధి గండకి నదికి ఉపనదిగా ఉన్న స్యార్ వాగులో కొండచరియలు విరిగిపడి నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆ అడ్డంకి ఒక్కసారిగా తొలగిపోవడంతో భారీగా నీరు దిగువ ప్రాంతాలకు పోటెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. వరదకు ముందు నీరు పలుమార్లు నిలిచిపోయి, తిరిగి ఉద్ధృతంగా ప్రవహించినట్లు కొందరు స్థానికులు వెల్లడించారు. ఘటనకు ముందు పెద్దగా వర్షాలు కురవలేదని వారు చెప్పడంతో వరదకు దారితీసిన పరిస్థితులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సహాయక చర్యలకు రంగం సిద్ధం..
వరద బాధితులను ఆదుకునేందుకు నేపాల్ సైన్యం, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగాయి. అవసరమైన ప్రాంతాలకు సహాయ సామగ్రిని చేరవేయడంతోపాటు, బాధితులను తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. లౌడ్స్పీకర్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టడంతోపాటు, ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పనులు కొనసాగుతున్నాయి.
గత విపత్తుల నేపథ్యంలో ఆందోళన
నేపాల్ పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలు తరచూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. తాజా ఘటనతో మరోసారి అక్కడి ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చుమ్నుబ్రి గ్రామీణ మున్సిపాలిటీ డిప్యూటీ చైర్పర్సన్ లక్ష్మి గురుంగ్ ఈ ఘటనను గతం, కొండచరియలు విరిగిపడే ఘటనలు తరచూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. తాజా ఘటనతో మరోసారి అక్కడి ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చుమ్నుబ్రి గ్రామీణ మున్సిపాలిటీ డిప్యూటీ చైర్పర్సన్ లక్ష్మి గురుంగ్ ఈ ఘటనను గతంలో రసువా జిల్లాలో సంభవించిన భోటే కోసి వరదలతో పోల్చినట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతులో రసువా జిల్లాలో సంభవించిన భోటే కోసి వరదలతో పోల్చినట్లు సమాచారం.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదకు గల కారణాలను గుర్తించడం, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడం, దెబ్బతిన్న ఇళ్లు, వంతెనలు, జలవిద్యుత్ మౌలిక సదుపాయాల నష్టాన్ని అంచనా వేయడంపై అధికారులు దృష్టి సారించారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రాధాన్యంగా చర్యలు చేపడుతున్నారు.
