రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

  • విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం చేస్తే సహించం
  • నిబంధనలను కఠినంగా అమలు చేయాలి
  • పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రహదారులపై భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు,కాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.ఆటోలు, స్కూల్ వ్యాన్లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు,స్పీడ్ గవర్నర్లు,సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం,సీట్‌బెల్ట్ ధరించకపోవడం, నంబర్ ప్లేట్ లేని వాహనాలు,మైనర్ల డ్రైవింగ్,ట్రిపుల్ రైడింగ్,సిగ్నల్ జంపింగ్ తదితర ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున,ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు వాహనదారులు, డ్రైవర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ సూచించారు.

ఈ సమీక్షలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్,ట్రాఫిక్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.