చెత్త తొలగింపులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం!
చెత్తలో కూర్చుని కౌన్సిలర్ నిరసన.. పాత పట్టణం, ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రతపై ఆగ్రహం
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డి పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ చెత్తలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత పట్టణ ప్రాంతంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో చెత్త పేరుకుపోతోందని తెలిపారు.
పారిశుధ్య కార్మికుల విధుల వేళల్లో మార్పులు చేయడంతో ఉదయం 11 గంటలైనా రోడ్లు శుభ్రం కావడం లేదని ఆరోపించారు. ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంతో రోగులు, ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పాత పట్టణం, సుభాష్ రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
