సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ హై అలర్ట్.. నేపాల్ వరదలపై అమిత్ షా
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో వరదల కారణంగా చోటుచేసుకున్న విధ్వంసంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సంక్షోభ సమయంలో భారత్ నేపాల్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్‌లో వరదల ప్రభావంపై బిహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో తాను మాట్లాడినట్లు అమిత్ షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదల ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగాలను, సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.
ఎన్‌డీఆర్ఎఫ్ హై అలర్ట్
నేపాల్ వరదల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ ను హై అలర్ట్‌లో ఉంచినట్లు అమిత్ షా తెలిపారు. స్థానిక అధికారులు, సహాయక-రెస్క్యూ బృందాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని, అవసరమైన సమయంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని అమిత్ షా వెల్లడించారు.
