National Farmer’s Day | జాతీయ రైతుల దినోత్సవం..

National Farmer’s Day | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రైతు శ్రమ దళారీల దోపిడీకి గురికాకూడదని అవిశ్రాంతంగా పోరాడి, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించాలని ఆశించి రైతాంగ సంక్షేమ కోసం కృషి చేసిన రైతు బాంధవుడు, భారతరత్న, భారత దేశ మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకొని జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం ముదావహమని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఇన్చార్జ్ డా. ఎస్.ఆర్. కోటేశ్వర రావు అన్నారు.

వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ లో జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంలో కీలక పాత్ర వహించడమేకాక పట్వారీ సమ్మె కేసుల పట్ల కూడా ఆయన ఎంతో కఠినంగా వ్యవహరించి రైతుల పక్షాన నిలిచారు అన్నారు. భారతదేశ కనీస మద్దతు ధర వ్యవస్థకు పునాది వేసిన ప్రధాన వ్యక్తిగా చరిత్రలో నిలిచారన్నారు. న్యాయమైన రైతు సేకరణ ధరల కోసం వాదించడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ బిల్లు (1938) ను ప్రవేశపెట్టడం, దుర్భిక్ష పరిస్థితులలో న్యాయమైన సేకరణకు పట్టుబట్టారని చెప్పారు.

మార్కెట్ అస్థిరతల నుండి రైతులను రక్షించడానికి కనీస అమ్మకపు ధరను అధికారికంగా ప్రకటింపజేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపారు. తొలుత చరణ్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ అధికారులు డా.ఎం.రమాదేవి, డా.బి.రవీంద్ర రెడ్డి, డా.ఎస్.కె. అబ్దుల్ సలాం, డా.జి.విజయ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply