Narendra Modi |ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యం.. యువతే బలం: మోదీ
- 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యానికి సన్నాహాలు
- భారత క్రీడలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేది యువతేనని వ్యాఖ్య
- క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సౌకర్యాల కల్పనపై దృష్టి
చెన్నై, ఆంధ్రప్రభ: 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికగా భారత్‌ను నిలబెట్టడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు, శిక్షణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆదివారం చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
క్రీడలను కేవలం వినోదంగా కాకుండా వృత్తిగా ఎంచుకునే యువతకు అవసరమైన ప్రోత్సాహం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మోదీ తెలిపారు. ప్రతి యువకుడిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ, ఆశయాలు ఉంటాయని, వాటిని వెలికితీసేందుకు సరైన వేదిక, సౌకర్యాలు, మద్దతు అవసరమని అన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ వ్యవస్థల బలోపేతంతో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు.
2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోందని, 2036 ఒలింపిక్స్ నిర్వహణ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రీడా పోటీలు భారత్‌లో నిర్వహిస్తే, యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్‌పై భారత్ ఆశలు
2036 ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల నిర్వహణపై భారత్ ఆసక్తి వ్యక్తం చేసింది. 2024 అక్టోబర్ 1న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు ఆసక్తి పత్రాన్ని సమర్పించింది. ప్రస్తుతం ఈ క్రీడల ఆతిథ్యంపై ఐఓసీతో చర్చలు జరుపుతున్న ఆసక్తిగల దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్‌తో పాటు జర్మనీ, హంగరీ, ఖతార్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, టర్కీ ఈ ప్రక్రియలో ఆసక్తి చూపుతున్నాయి. ఐఓసీ ఎంపిక ప్రక్రియలో తదుపరి దశకు చేరే దేశాలను 2027 మార్చి నాటికి షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే తుది ప్రక్రియ 2029 మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉంది.
2030 కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు భారత్‌కు అంతర్జాతీయ క్రీడా నిర్వహణలో తన సామర్థ్యాన్ని చాటుకునే కీలక అవకాశంగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సహాయక వ్యవస్థల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది.
