Narayanpet | అత్తా – కోడళ్ల రాజకీయ సవాల్..

Narayanpet | అత్తా – కోడళ్ల రాజకీయ సవాల్..

-నెగ్గేది ఎవరు… తగ్గేది ఎవరు..?
-నారాయణపేట మున్సిపల్ పీఠం పై పోరు

Narayanpet, ఆంధ్రప్రభ : నారాయణపేట మున్సిపల్ పగ్గాల కోసం రాజకీయంగా ఉత్కంఠభరితమైన పోరు సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో అధికార పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ చెస్ ఆట కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 11 స్థానాలు, కాంగ్రెస్ 7 స్థానాలు, బీఆర్‌ఎస్ 2, ఎంఐఎం 2, ఫార్వర్డ్ బ్లాక్ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానం గెలుచుకున్నాయి. అయితే.. స్వతంత్ర కౌన్సిలర్ జయశ్రీ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో కమలం శిబిరం బలం 12కు చేరుకుంది. అయినప్పటికీ.. చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 కావాల్సి రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఈ నేపథ్యంలో బీజేపీ బలం పెంచేందుకు ఎంపీ డీకే అరుణ ఎక్స్ ఆఫీషియో సభ్యురాలిగా మున్సిపల్‌లో తన ఓటును నమోదు చేసుకోవడం రాజకీయంగా కీలక మలుపు తీసుకొచ్చింది. ఇక మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. అదే విధంగా ఎంఐఎం కౌన్సిలర్లు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలనే షరతుతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికరెడ్డి కూడా ఎక్స్ ఆఫీషియో సభ్యురాలిగా మున్సిపల్‌లో పేరు నమోదు చేయడం రాజకీయ సమీకరణాలను మరింత రసవత్తరంగా మార్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల పాత్ర కీలకంగా మారింది. వారు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే బీజేపీ, కాంగ్రెస్ బలం సమాన స్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో ఒక్కో ఓటు నిర్ణాయకంగా మారే పరిస్థితి నెలకొంది. ఇలా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రాజకీయంగా మాత్రమే కాకుండా కుటుంబ సంబంధాల పరంగా కూడా ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికరెడ్డి మధ్య అత్త – కోడళ్ల పోటీగా మారిన ఈ రాజకీయ సమరం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు పట్టణ ప్రజల్లో ఒక్కటే ప్రశ్న మార్మోగుతోంది..

అత్త గెలుస్తుందా..?
కోడలు పైచేయి సాధిస్తుందా..?

నారాయణపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఎవరి వైపు మొగ్గుతాయో తెలియక పట్టణ ప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ పోరు కేవలం పదవుల కోసం కాదు.. రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిగత ప్రభావం, పార్టీ గౌరవం కోసం సాగుతున్న అసలైన శక్తి పరీక్షగా మారింది.

Leave a Reply