Narayanpet | కందుల కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం

Narayanpet | కందుల కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం
- రైతులకు రూ.10కోట్లకు పైగా నష్టం
Narayanpet | నారాయణపేట ప్రతినిధి ఆంధ్రప్రభ : కందుల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నారాయణపేట రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు ప్రారంభించామని చెప్పినా, ఇప్పటివరకు ఒక్క రైతు నుంచైనా ఒక్క క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. మార్క్‌ఫెడ్ అధికారుల కొరత, కఠిన నిబంధనలు, ముందుచూపు లేని నిర్ణయాలే ఇందుకు కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గత రెండు నెలలుగా ప్రతిరోజూ 2,000–3,000 బస్తాల కందులు మార్కెట్ యార్డ్‌కు వస్తున్నా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో సుమారు 80శాతం మంది రైతులు ప్రైవేట్ మార్కెట్‌లో ఒక్కో క్వింటాల్‌కు సగటున రూ.2,000 నష్టంతో పంటను అమ్ముకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఇప్పటివరకు రైతులకు రూ.10కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.
కేంద్రం మద్దతు ధర ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు కాకుండా మధ్యవర్తులకు మేలు చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ కిసాన్ సంఘం నేతలు వెంటనే కందుల కొనుగోలును యుద్ధప్రాతిపదికన ప్రారంభించి, నిబంధనలు సడలించి, రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
