మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
పౌర సేవల్లో అలసత్వం వహించరాదు: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నరసాపురం, ఆంధ్రప్రభ: నరసాపురం మున్సిపల్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీతో మున్సిపల్ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. తనిఖీలో భాగంగా శాఖల వారీగా సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై ఆయన ఆరా తీశారు. కార్యాలయంలో సిబ్బంది హాజరును పరిశీలించి ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తిస్తున్నారనే విషయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. పౌర సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో తహసీల్దార్ నాగార్జున ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
