పేట బైపాస్‌ వద్ద మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు చిలకలూరిపేట బైపాస్‌ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. నరసరావుపేట పర్యటనకు జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ చిలకలూరిపేట బైపాస్‌ వద్దకు చేరుకోగానే పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ‘సీఎం లోకేష్‌.. సీఎం లోకేష్‌’ అంటూ నినాదాలు చేయడంతో పరిసరాలు మార్మోగాయి. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసిన మంత్రి నారా లోకేష్‌ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. ఆప్యాయంగా పలకరించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం నరసరావుపేట పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, నియోజకవర్గ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.