నందికొట్కూరులో వైసీపీ విజయం!
ఉత్కంఠ పోరులో మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం
2,439 ఓట్ల భారీ మెజారిటీతో షేక్ ఫాతిమాభి ఘన విజయం
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్ సుధీర్ ధారా వ్యూహాలకు ఫలితం
మూడు రౌండ్లలోనే విజయదుందుభి
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తి రేకెత్తించిన ఈ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరుకు తెరదించుతూ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ ఫాతిమాభి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 2,439 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీకి అనుకూలమైన ఫలితాలు అంతగా కనిపించని రాజకీయ పరిస్థితుల్లో నందికొట్కూరులో ఆ పార్టీ సాధించిన ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రస్థాయి రాజకీయ వర్గాల్లోనూ ఈ ఫలితం చర్చనీయాంశంగా మారింది.
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వానికి ప్రజామోదం!
నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్ ధారా ఆధ్వర్యంలో సాగిన ఎన్నికల ప్రచారం విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ అభ్యర్థి విజయమే లక్ష్యంగా సాగించిన ప్రచారం ఫలితాన్నిచ్చింది. టీడీపీ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీతో ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి షేక్ ఫాతిమాభి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
వైసీపీ శ్రేణుల్లో సంబరాలు
2,439 ఓట్ల భారీ మెజారిటీతో షేక్ ఫాతిమాభి విజయం సాధించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్ సుధీర్ ధారా నాయకత్వంలో సాధించిన ఈ విజయాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మక విజయంగా అభివర్ణిస్తున్నాయి. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకోవడంతో స్థానిక రాజకీయాల్లో ఈ ఫలితం చర్చనీయాంశంగా మారింది.
