వివాహిత అనుమానాస్పద మృతి..

పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రుల ధర్నా

పథకం ప్రకారమే హత్య చేశారంటూ సీపీఎం నేత కుటుంబంపై ఆరోపణలు

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణంలో వివాహిత శివప్రియ (27) అనుమానాస్పద మృతితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇది ఆత్మహత్య కాదని, భర్త, అత్తమామలు పక్కా పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సాయంత్రం నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు కుటుంబాన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బ్యానర్‌తో ఆందోళన నిర్వహించారు.

శివప్రియ సోమవారం ఉదయం తన తండ్రి నాగరాజుకు ఫోన్ చేసి, అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నానని వాపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి భర్త విద్యుత్ వైరుతో కొట్టాడని, వచ్చి మాట్లాడాలని తండ్రిని కోరుతూ ఆమె బోరున విలపించిందని చెప్పారు. సాయంత్రం వస్తానని తండ్రి ధైర్యం చెప్పిన గంటల వ్యవధిలోనే శివప్రియ ఉరి వేసుకుని మృతి చెందినట్లు అల్లుడు శ్రీనివాస్ సమాచారం అందించాడని నాగరాజు తెలిపారు. దీంతో తన కుమార్తె మృతిపై అనుమానాలు మరింత బలపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా కోనేరు గ్రామానికి చెందిన శివప్రియకు రెండేళ్ల క్రితం నందికొట్కూరు సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు కుమారుడు శివకుమార్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి భర్త మద్యానికి బానిసై తన కుమార్తెను వేధిస్తున్నాడని తండ్రి నాగరాజు ఆరోపించారు. నెల రోజుల క్రితం శివప్రియను తీవ్రంగా కొట్టి పుట్టింటికి పంపించాడని, పెద్దలు సర్దిచెప్పడంతో తిరిగి అత్తింటికి పంపించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుమార్తె మృతదేహం వద్ద తల్లి లక్ష్మీదేవి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.