విద్యాసంస్థల మధ్య లాడ్జీల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు
పాఠశాల పక్కనే.. కళాశాల ఎదురుగానే లాడ్జీలు..
తనిఖీలు చేపట్టాలని స్థానికులు, తల్లిదండ్రుల డిమాండ్

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : పట్టణంలో విద్యాసంస్థల మధ్య లాడ్జీల నిర్వహణ, వాటిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని విజయవాణి ఉన్నత పాఠశాల పక్కనే, సాయిరాం డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న ఓ లాడ్జీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాసంస్థలకు సమీపంలో లాడ్జీల నిర్వహణకు సంబంధించి నిబంధనలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
సదరు లాడ్జీలో పేకాట, మద్యం సేవించడం, యువతులను తీసుకురావడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో 2024 ఏప్రిల్ 19న ఇదే తరహా ఘటన చోటుచేసుకుందని, ఇటీవల సుమారు 20 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పేకాట ఆడుతూ కొందరు పట్టుబడ్డారని వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ లాడ్జీ నిర్వహణ తీరులో మార్పు కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
హోటల్ ముసుగులో లాడ్జీ నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రేమ పేరుతో రెండు నెలలుగా వేధిస్తూ, బలవంతంగా లాడ్జీకి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
తాజాగా మరో యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఇదే లాడ్జీకి తీసుకెళ్లి వేధించారనే ఫిర్యాదు నందికొట్కూరు పట్టణ పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ పరిణామంతో పట్టణంలోని లాడ్జీల నిర్వహణ తీరుపై మరోసారి చర్చ మొదలైంది.
విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న లాడ్జీలపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సరైన గుర్తింపు పత్రాలు లేకుండా గదులు కేటాయిస్తున్న యాజమాన్యాలపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్న లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
