ప్రశాంతతను పొగట్టాలని చూస్తే మళ్ళీ అడుగుపెట్టలేవ్

: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

: నందికొట్కూరు లో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోను
: తోకలు కట్ చేస్తాం..మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఉండదు
: డాక్టర్ ధారా సుధీర్ పై ఎంపీ బైరెడ్డి ఆగ్రహం

నందికొట్కూరు రూరల్, ఆంధ్రప్రభ : నందికొట్కూరులో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ బైరెడ్డి శబరి హెచ్చరించారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. శనివారం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామ బస్టాండ్‌ సెంటర్‌లో ఎంపీ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో, ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాల కాలనీల్లో ఎంపీ నిధులతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

ఇటీవల వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ధారా సుధీర్‌ కూటమి నేతలు, ప్రభుత్వంపై చేసిన విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా బైరెడ్డి శబరి తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి నందికొట్కూరులో ఫ్యాక్షన్‌ గురించి మాట్లాడటం సరికాదన్నారు. తాము ఇక్కడే పుట్టి పెరిగి ఫ్యాక్షన్‌ను కళ్లారా చూసినవారమని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న నందికొట్కూరులో ఫ్యాక్షన్‌కు తెరలేపాలని చూస్తే సహించబోమని, “తోకలు కట్‌ చేస్తాం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. నందికొట్కూరు ప్రజలు తెలివైనవారని, బయట నుంచి వచ్చి పెత్తనం చెలాయించాలని చూస్తే ప్రజలు అంగీకరించరని అన్నారు. ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే నందికొట్కూరులో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.

కార్యక్రమంలో ముచ్చుమర్రి టీడీపీ సీనియర్‌ నాయకులు కాటం వెంకటరామిరెడ్డి, రాఘవరెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు కుమ్మరి నాగరాజు, సుబ్బారావు, బాలనారాయణ, నాగేశ్వరావు, చిన్న సుంకన్న, రాముడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డి. సుధాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ కాకరవాడ చిన్న వెంకటస్వామి, కట్టుబడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.