కూలిపోయిన సీఎస్‌ఐ స్కూల్‌ ప్రహరీ గోడ

నందికొట్కూర్, ఆంధ్రప్రభ: నందికొట్కూర్ పట్టణంలోని విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద విద్యార్థుల భద్రతపై అధికారులు, పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని సాయిబాబాపేటలో ఉన్న ఏళ్ల చరిత్ర కలిగిన సీఎస్‌ఐ హైస్కూల్‌ ప్రహరీ గోడ కూలిపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాలకు రక్షణగా ఉన్న రాతి ప్రహరీ గోడ ఇటీవల సగం వరకు కూలిపోయి రాళ్లు, మట్టి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మిగిలిన భాగం కూడా పగుళ్లతో ప్రమాదకరంగా మారి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కూలిన ప్రాంతంలో చెత్త, ముళ్లపొదలు పేరుకుపోవడంతో పాఠశాల ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లగా, అది ఎయిడెడ్‌ పాఠశాల కావడంతో తమ పరిధిలోకి రాదని చెప్పినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎస్‌ఐ యాజమాన్యం నిధులు లేవని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు, యాజమాన్యం ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకుంటూ విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం విద్యానగర్‌ ఉర్దూ పాఠశాలలో ప్రహరీ గోడ కూలి చిన్నారి మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అన్ని పాఠశాలలను పరిశీలించాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. సీఎస్‌ఐ స్కూల్‌లో ప్రమాదకరంగా ఉన్న మిగిలిన గోడను తొలగించి కొత్త ప్రహరీ నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.