సీసీ రోడ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్
నాణ్యతలో రాజీ లేదు.. త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆత్మకూరు రోడ్డులోని కర్నూలు–గుంటూరు రహదారి పనులతో పాటు షికారి పేట ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి శనివారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ దినేష్‌కుమార్ ఉన్నారు. రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్న సిమెంట్, కంకర నాణ్యత, రోడ్డు మందం, క్యూరింగ్ విధానాన్ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై ఏఈ, కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రభుత్వ నిధులు వృథా కాకుండా రోడ్లు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మించాలని స్పష్టం చేశారు. సీసీ రోడ్లకు సకాలంలో వాటర్ క్యూరింగ్ చేయకపోతే పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల క్యూరింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణ సమయంలో ప్రజలు, వాహనదారులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
