Nandigama MLA | పటిష్ట వ్యవస్థలతోనే అభివృద్ధి పరుగులు..
- డీడీవో కార్యాలయాల ద్వారా మరింత అభివృద్ధికి వీలు.
- సమన్వయంతో సరైన సేవలందిద్దాం…
- వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలకు సమష్టిగా కృషిచేద్దాం..
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Nandigama MLA | నందిగామ, ఆంధ్రప్రభ : వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే అభివృద్ధి అంత బాగా పరుగులు తీస్తుందని.. డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీడీవో) కార్యాలయాల ద్వారా మరింత ప్రగతికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీవో కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిగామ మండలం, ఐతవరంలో గురువారం జరిగిన డీడీవో కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ హోంమంత్రివర్యులు వసంత నాగేశ్వరరావుతో పాటు కలెక్టర్ లక్ష్మీశ, శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నందిగామ డివిజన్ డీడీవో జి.జ్యోతికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు ప్రారంభం కావడం శుభ పరిణామమని.. కీలక ప్రగతి సూచికల్లో అభివృద్ధికి, తలసరి ఆదాయం పెరుగుదలకు అన్ని శాఖల అధికారులు కృషిచేస్తున్నారని.. వీటికి సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉంటోందన్నారు. నియోజకవర్గాల స్థాయిలో విజన్ యూనిట్లు కూడా పనిచేస్తున్నాయని.. అభివృద్ధికి సంబంధించి అన్ని అంశాల్లోనూ పురోగతికి ప్రజాప్రతినిధులతో కలిసి కృషిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
..గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఊతం..
డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయాల ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని.. ఈ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి క్షేమం, సంక్షేమానికి కృషిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కృషిచేస్తున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి కలెక్టర్ లక్ష్మీశగారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని.. ఆయన మన జిల్లాకు కలెక్టర్‌గా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, డ్వామా పీడీ ఎ.రాము, పంచాయతీరాజ్ ఎస్ఈ బాపిరెడ్డి, డీఈ రమేష్, డ్వామా ఏపీడీ లక్ష్మీకుమారి, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

