రైతు, విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ విఫలం

నాంపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా..
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

నాంపల్లి, ఆంధ్రప్రభ : రైతులు, విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మటపు నరసింహారావు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు, వ్యవసాయ రంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యుత్‌ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ సరఫరా విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచాలని కోరారు. అనంతరం విద్యుత్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ధర్నాలో మాల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జగదీష్‌, మర్రిగూడ మాజీ ఎంపీపీ మొండి మోహన్‌రెడ్డి, ఇట్టెం వెంకటరెడ్డి, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, నక్క చంద్రశేఖర్‌, సర్దార్‌ నాయక్‌, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల రాజమల్లు, వడ్డేపల్లి శ్రీశైలం, కామిశెట్టి పాండు, నాంపల్లి సంజీవ, కుంభం చరణ్‌రెడ్డి, గంజి సంజీవ, బుషిపాక ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.