రెండు వేల మందిని చెదరగొట్టి.. ఘర్షణకు అడ్డుకట్ట
వెంగలాయపాలెంలో ఉద్రిక్తత..
సమయస్ఫూర్తితో వ్యవహరించిన నల్లపాడు సీఐ పొన్నూరు భాస్కర్
గుంటూరు వెస్ట్, ఆంధ్రప్రభ: ఎన్నికల వేళ గుంటూరు రూరల్ మండలం వెంగలాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి, పరస్పరం దాడులకు దిగే పరిస్థితి ఏర్పడింది. సుమారు రెండు వేల మంది వరకు గుమిగూడటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ సమయంలో నల్లపాడు సీఐ పొన్నూరు భాస్కర్ వేగంగా స్పందించి రంగంలోకి దిగారు. ఇరు వర్గాల వారినీ సమానంగా నియంత్రిస్తూ, గుంపులను చెదరగొట్టి ఘర్షణకు అడ్డుకట్ట వేశారు.
గుంటూరు రూరల్ మండలం వెంగలాయపాలెం ఎంపీటీసీ-1 పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇంటూరి అంజిరెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ మైనారిటీ నాయకురాలు షేక్ అమీనా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అంజిరెడ్డి అనుచరులు అమీనా వద్దకు రావడంతో వివాదం మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న మైనారిటీ వర్గీయులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. పరస్పరం దాడులకు దిగే పరిస్థితి నెలకొంది.
రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి..
పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీఐ పొన్నూరు భాస్కర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్యకు వెళ్లి పరిస్థితిని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న వారిని శాంతింపజేస్తూనే, గుంపులుగా చేరిన వారిని చెదరగొట్టారు. ఎవరి పక్షం వహించకుండా ఇరు వర్గాల వారినీ సమానంగా నియంత్రిస్తూ చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన వేగవంతమైన చర్యలతో ఘర్షణ వాతావరణం క్రమంగా సద్దుమణిగింది.
సమయస్ఫూర్తికి స్థానికుల అభినందనలు
దాదాపు రెండు వేల మంది వరకు గుమిగూడినప్పటికీ పరిస్థితి అదుపుతప్పకుండా చూడటంలో సీఐ కీలక పాత్ర పోషించారు. ఆయన సకాలంలో స్పందించకపోతే భారీ ఘర్షణ జరిగి ఉండేదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇరువర్గాలనూ కట్టడి చేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంపై వెంగలాయపాలెం ప్రజలు సీఐ పొన్నూరు భాస్కర్‌ను అభినందించారు.
