ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ: ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా గ్రామం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బంజారా గ్రామానికి చెందిన దారావత్ హరి ట్రాక్టర్‌ను డ్రైవర్ డీజిల్ కోసం మండల కేంద్రానికి తీసుకెళ్తుండగా, గోపాల్‌పేట్ గ్రామానికి చెందిన కమ్మరి రవి ద్విచక్రవాహనంపై బంజారా నుంచి గోపాల్‌పేట్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమ్మరి రవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.