యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి సయ్యద్ ఖలీద్
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాలో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, యువత కృషి చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి సయ్యద్ ఖలీద్ కోరారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌కుమార్ అధ్యక్షతన జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి సయ్యద్ ఖలీద్, జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్, జిల్లా ఇన్‌చార్జి జరుపుల లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సయ్యద్ ఖలీద్ మాట్లాడుతూ జిల్లాలో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఓటర్ల జాబితా అంశంపై బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రజలకు వివరించి, ఆ పార్టీ విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు యువజన కాంగ్రెస్ పోరాటం కొనసాగించాలని కోరారు. జాతీయ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇచ్చే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం సీఐఆర్ అంశంపై కాంగ్రెస్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
జిల్లాలో యువజన కాంగ్రెస్ నిర్మాణాన్ని పూర్తి చేసి మండలాల వారీగా నాయకత్వాన్ని తయారు చేయాలని ఆయన సూచించారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. రాష్ట్రంలో యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకు వివరించాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, తాలూకా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
