నాగర్‌కర్నూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి
విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట.. విద్యార్థులే భవిష్యత్తును నిర్ణయించేది
జూనియర్ కళాశాల విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కష్టపడి చదువుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి కోరారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవిప్రకాష్ అధ్యక్షతన విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్టులు, దుస్తులు, వర్క్‌బుక్‌లతో కూడిన విద్యా కిట్లను పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ విద్యార్థులు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా విద్యార్థులు కృషి చేయాలని కోరారు. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని రూ.9 కోట్లతో నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇప్పటికే సీఎస్ఆర్ నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో ఆధునిక వసతులతో కొత్త పాఠశాలలను నిర్మించామని పేర్కొన్నారు. మరో పది పాఠశాలల వరకు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని, విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా జూనియర్ కళాశాల స్థాయిలోనూ టిఫిన్, భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియను నాగర్‌కర్నూల్‌లో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
