పేదలకు భరోసాగా నిలిచే నాయకుడు పవన్‌ కల్యాణ్‌

అశ్వారావుపాలెంలో రూ.54.60 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగబాబు

రూ.15 లక్షలతో నిర్మించిన సభా వేదిక, మండలి వెంకట కృష్ణారావు విగ్రహం, పార్కు ప్రారంభం

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పేదలకు భరోసాగా నిలిచే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని ఏపీ గ్రీన్‌ బోర్డు చైర్మన్‌, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. మంగళవారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహకారంతో పల్లె పండుగ-1, 3 ద్వారా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, వీబీజీ-రాంజీ నిధులు రూ.54.60 లక్షలతో మూడు సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామ మాజీ సర్పంచ్‌, జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ నిర్వాహక దళ్‌ సభ్యుడు పండ్రాజు లంకమ్మ ప్రసాద్‌, రేపల్లె పార్థసారథి ఆధ్వర్యంలో రూ.15 లక్షలతో నిర్మించిన మండలి వెంకట కృష్ణారావు-పండ్రాజు నాగభూషణం పార్కు, సభా వేదికను, స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు నూతన విగ్రహాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల మధ్య ఉంటున్న పవన్‌ కల్యాణ్‌.. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా గ్రామీణ అభివృద్ధికి విస్తృతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గిరిజన మహిళకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తన కోసం ఏమీ దాచుకోకుండా ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని పేర్కొన్నారు. తన కళ్ల ముందే మహా నాయకుడిగా ఎదిగిన పవన్‌ కల్యాణ్‌కు అన్నలా కాకుండా నమ్మకమైన కార్యకర్తగా ఉంటానన్నారు. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తనకు అప్పగించిన శాఖల ద్వారా రాష్ట్ర ప్రగతికి శ్రమిస్తున్నారని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ గ్రామీణ అభివృద్ధికి చేస్తున్న కృషికి అశ్వారావుపాలెం నిదర్శనమన్నారు.

పల్లెటూరిలోని స్వచ్ఛత, సంతోషం

పల్లెటూరిలో ఉండే స్వచ్ఛత, సంతోషం పట్టణాల్లో ఉండవని నాగబాబు అన్నారు. గ్రామాల్లోని ప్రకృతి సౌందర్యం, ఆప్యాయత, ప్రేమ నగరాల్లో ఉండవన్నారు. సమీపంలోని చల్లపల్లితో తనకు అనుబంధం ఉందన్నారు. చల్లపల్లిలో తమ పెదనాన్న ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారని, సెలవుల్లో వారి ఇంటికి వచ్చేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.

చదువుకునే రోజుల్లో విద్యాశాఖ మంత్రిగా మండలి వెంకట కృష్ణారావు పేరు చిరపరిచితమని అన్నారు. విద్యాశాఖలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. నిజాయితీ, స్వచ్ఛత కలిగిన కుటుంబంగా మండలి కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. కృష్ణారావు తనయుడు మండలి బుద్ధప్రసాద్‌ జనసేన పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే కావడం తమకు గర్వకారణమన్నారు. అవగాహన, విజ్ఞానం, మంచితనం కలిగిన అతికొద్దిమంది ఎమ్మెల్యేల్లో బుద్ధప్రసాద్‌ ఒకరని పేర్కొన్నారు.

ఎల్‌నినో నేపథ్యంలో ఈ సీజన్‌లో రైతులకు సాగునీటి సరఫరా తగ్గకుండా, నియోజకవర్గ రైతులకు క్రమం తప్పకుండా సాగునీరు అందేలా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ చేసిన కృషి అభినందనీయమన్నారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ గత పాలనలో అభివృద్ధికి నిధులు అందక ఇబ్బందులు పడిన అశ్వారావుపాలెం గ్రామానికి కూటమి ప్రభుత్వంలో పునరుజ్జీవం కలిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహకారంతో దాదాపు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించి ప్రధాన, అంతర్గత రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గత పాలన అంతం కావడానికి, కూటమిలోకి బీజేపీ రావడానికి కృషి చేసిన పవన్‌ కల్యాణ్‌.. కూటమి ప్రభుత్వంలో కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ లంకమ్మ ప్రసాద్‌, మాజీ ఎంపీటీసీ కటికల వసంత్‌లను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు, పూషడపు రత్నగోపాల్‌, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, పంచాయతీరాజ్‌ డీఈ పగడాల సురేష్‌, అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.