హైదరాబాద్ : ఆర్థిక శాఖ మంత్రిగా ప్రాజెక్ట్ నిధులు కేటాయించడమే తన పని అని, కాళేశ్వరం సాంకేతిక విషయాలు తన పరిధిలోకి రావని మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణకు నేడు ఆయన బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటల హాజరు కాగా.. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌లపైనే కమిషన్ ప్రశ్నించింది.
ఆ నిర్ణయం క్యాబినేట్ సబ్ కమిటిదే..
ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు, మేడిగడ్డ-అన్నారం-సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని ఈటలను కమిషన్ అడిగింది. టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, క్యాబినెట్ నిర్ణయం తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని ఈటల బదులిచ్చారు.
కేంద్ర జలవనరుల శాఖ, మహారాష్ట్ర అభ్యంతరంతోనే ..
తుమ్మిడి హేట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర , కేంద్ర జలవనరుల శాఖ ఒప్పుకోలేదని, అందుకే 150 నుంచి 148 కుదించామని చెప్పారు. రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ చీఫ్ ప్రశ్నించగా. మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో అప్పటి సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని జవాబిచ్చారు. హరీష్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామని.. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని ఈటల చెప్పారు.
రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? అని కమిషన్ అడగగా రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని ఈటెల రాజేందర్ తెలిపారు. బ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు? అని ప్రశ్నిస్తే.. టెక్నికల్ డిటైల్స్ మీద తమకు అవగాహన ఉండదని, అంతా నిపుణులే చూసుకున్నారన్నారు.
నిర్మాణ వ్యయం పెంపు …
ప్రాజెక్ట్ వ్యయం పూర్వ పరాలను ఈటల వివరిస్తూ, 2016 తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16,500 కోట్లని.. ఆ తరువాత ప్రాజెక్ట్ వ్యయం రూ.38 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవనే రిపోర్టులు వచ్చాయని అన్నారు. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరాన్ని ఎంపిక చేశారని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ వేశారని అందులో తాను తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉన్నామని అన్నారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. అనంతరం కేబినెట్ కూడా మొత్తం బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని అన్నారు. టెక్నికల్ అంశాలన్ని పరిశీలించాకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాచారం అంతా కేసీఆర్, హరీశ్‌రావుల వద్దే ఉందని ఈటల పేర్కొన్నారు. నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది? అనే ప్రశ్నకు.. ముందుగా రూ.63 వేల కోట్లతో అనుకున్నామని, తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగిందని, ఇప్పుడు ఎంత అయ్యిందో తనకు తెలియదన్నారు. బ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా? అని కమిషన్ అడిగితే.. ఫైన్సాన్స్ ఖాశాఖకు ఫుల్ డీటెయిల్స్ తెలియవని, ఇరిగేషన్ శాఖకే వివరాలు తెలిసి ఉంటుందని ఈటెల బదులిచ్చారు.
కాగా విచారణ అనంతరం బయటకు వచ్చిన ఈటట మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా, కేబినెట్ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశానని స్పష్టం చేశారు. నిధుల విడుదల విషయంలో తన సొంత అజెండాలు ఏమి లేవని అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్‌కు ఎదుట స్పష్టం చేశానని అన్నారు. నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులను మాత్రమే ఆర్థిక శాఖ చూసుకుందని ఈటల రాజేందర్ తెలిపారు.
రూ.595 కోట్ల విషయం తెలియదు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని ముందుగా రూ.82 వేల కోట్ల వ్యయంగా అంచనా వేశారని తెలిపారు. ఆ తర్వాత ఆ అంచనాలు ఎంతకు పెరిగాయో తనకు తెలియదని అన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం రూ.595 కోట్లు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తాను మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, తెలంగాణ సమాజానికి 25 ఏళ్లుగా తాను సుపరిచితుడినని అన్నారు.
కేబినెట్‌కు బాస్ కేసీఆర్..
కాళేశ్వరానికి మొదట్లో రూ.63 వేల కోట్ల అంచనా వేయగా.. క్రమంగా ఆ వ్యయం రూ.83 వేల కోట్లకు పెరిగిందని, చివరికి ఎంతైందో తనకు తెలియదని అన్నారు. కాళేశ్వరం విలువ, ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని కామెంట్ చేశారు. అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్తోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తాను కట్టానని కేసీఆరే చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు. కేబినెట్‌కు బాస్ కేసీఆర్ అని.. నిర్ణయం తీసుకుంది ఆయనేనని అన్నారు.. కాళేశ్వరంపై ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్టులను బయటపెట్టాలని ఈటెల డిమాండ్ చేశారు.