ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.4 లక్షలే

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: రిటర్నింగ్‌ అధికారి రమేష్‌బాబు

ముత్తుకూరు, ఆంధ్రప్రభ : మండల ప్రజా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (ఎంపీటీసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం గరిష్ఠంగా రూ.4 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఓ. రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 17 మంది, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 17 మంది, సీపీఎం నుంచి ముగ్గురు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా ఐదుగురు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ప్రచార మైకుల వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని రమేష్‌బాబు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం, మతపరమైన సమావేశాలు నిర్వహించడం నిషేధమని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడంతో పాటు శిక్షలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.