స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించాలి
ఉట్నూర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ:వైద్యాధికారులు, వైద్య సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సూచించారు. బుధవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉపేందర్ జాదవ్, వైద్యాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై జాటోత్ హుస్సేన్ నాయక్ ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, అసౌకర్యాలు, వైద్య సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉపేందర్ జాదవ్, బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, మహిళా నాయకురాలు సుమన్ బాయి జాదవ్, నాయకులు రాజేశ్వర్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
