మురసు తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి
30 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..
471 జేసీబీలు, 421 విద్యుత్ రంపపు యంత్రాలతో సహాయక చర్యలు
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి : మురసు తుఫాన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల భద్రత, రాకపోకల పునరుద్ధరణకు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు, జాతీయ రహదారుల పరిధిలో మొత్తం 30 కంట్రోల్ రూమ్‌లు, సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 40 మంది సమన్వయ అధికారులను నియమించామని, వివిధ శాఖల సమన్వయంతో ఎనిమిది సమావేశాలు నిర్వహించి చర్యలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తుఫాన్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 178 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 471 జేసీబీలు, 421 విద్యుత్ రంపపు యంత్రాలతో అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
మొత్తం 53 ప్రాంతాల్లో సిబ్బంది, యంత్రాలు, అవసరమైన సామగ్రితో సహాయక బృందాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయన్నారు. ప్రధాన నగరపాలక సంస్థల్లో ఉచిత ఫోన్ సహాయ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు.
లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే రహదారుల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారులపై కూలిన చెట్లను తక్షణమే తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా రహదారులకు గండ్లు ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సిబ్బంది, యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
తుఫాన్ ప్రభావంతో ప్రమాదం కలిగించే అవకాశం ఉన్న ఎండిన, చనిపోయిన చెట్లను గుర్తించి తొలగించే చర్యలు చేపడుతున్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో గండ్ల పూడ్చివేతకు ఇసుక బస్తాలు, నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో రహదారులకు గండ్లు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రత్యేక విపత్తు స్పందన బృందాలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారుల సెలవులను రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలకు రహదారి రవాణాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి అత్యవసర పరిస్థితినీ ఎదుర్కొనేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
