డిల్లీలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ముప్పిడి గోపాల్
- కేవీపీ రామచంద్రరావుతో భేటీ..
- వైఎస్సార్ ఆశయాలు, ప్రస్తుత రాజకీయాలపై చర్చ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ముప్పిడి గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవలను, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను నేతలు స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమం అనంతరం ముప్పిడి గోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వైఎస్సార్‌కు సన్నిహితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా వైఎస్సార్ ఆశయాలు, ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ వైఎస్సార్ చూపిన ప్రజా సేవా మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం.
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరై మాజీ ముఖ్యమంత్రికి నివాళులర్పించారు.
