అనంతపురంలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్.. రేపు ఒక బూత్‌లో రీపోలింగ్
- 30వ డివిజన్ 3వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగం కావడంతో ఎస్‌ఈసీ నిర్ణయం
- జిల్లావ్యాప్తంగా 62 శాతం పోలింగ్ నమోదు.. తాడిపత్రి, గుంతకల్లులో అధికం
- రీపోలింగ్‌లో ఓటర్లంతా పాల్గొనాలి.. కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీశ్
అనంతపురం, క్రైమ్, ఆంధ్రప్రభ :
జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. అయితే అనంతపురం నగరంలోని 30వ డివిజన్ పరిధిలోని 3వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ కేంద్రం పరిధిలోని ఓటర్లంతా ఎలాంటి సందేహాలు లేకుండా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఆదివారం రాత్రి అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీశ్ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల వివరాలు వెల్లడించారు. అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో మొత్తం ఆరు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ బృందాలు రిసెప్షన్ కేంద్రాలకు చేరుకున్నాయని, బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే ప్రక్రియ, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు, సీలింగ్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. జిల్లా మొత్తంగా సుమారు 62 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతాల్లో అత్యధికంగా, అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో కొంత తక్కువగా ఓటింగ్ నమోదైందన్నారు.
ఒక బూత్‌లోనే రీపోలింగ్
అనంతపురం నగరంలోని 30వ డివిజన్ 3వ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం కొంతమంది అక్రమంగా లోపలికి ప్రవేశించి, అధికారులను బయటకు పంపి బ్యాలెట్ పెట్టెల్లో ఓట్లు వేసేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ జగదీశ్ వివరించారు. ఈ ఘటనపై పోలింగ్ అధికారి డైరీ, కలెక్టర్ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ కేంద్రంలో మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించే ప్రక్రియ పూర్తిచేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రీపోలింగ్ కోసం కొత్త పోలింగ్ సామగ్రి, సిబ్బంది ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఎన్నికల నిర్వహణలో ఆరు వేల మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. క్యూ లైన్ల నిర్వహణ కోసం అదనంగా 1,700 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. గత 48 గంటలుగా సుమారు 1,800 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించారని, సివిల్ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు.
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 30 డ్రోన్ కెమెరాలు, ఇతర మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 వరకు డ్రోన్ కెమెరాలను వినియోగించినట్లు తెలిపారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన మార్గాల్లో 40 బాడీ వార్న్ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ పరిస్థితులను పర్యవేక్షించామన్నారు. కలెక్టరేట్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, పోలీసు కంట్రోల్ రూమ్‌ల ద్వారా సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు సీసీటీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ రోజున కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ప్రజలకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
