Municipal-Elections-Palnadu : లైన్ క్లియర్.. గురూ..:Andhra Prabha Exclusive Story
Municipal-Elections-Palnadu : లైన్ క్లియర్.. గురూ..:Andhra Prabha Exclusive Story
- పురపోరు ప్రత్యక్షం కాదు
- ఛైర్మన్ గిరి మహా కష్టం!
- పార్టీ ఇన్చార్జులకు తలనొప్పి
(పల్నాడుబ్యూరో , ఆంధ్రప్రభ)
హైకోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికల పునర్విభజన చిక్కులు వీడి నగారా మోగేందుకు మార్గం సుగమమైంది. అయితే, గతంలోలా కాకుండా మారిన నిబంధనలు, భారీ వ్యయం భయంతో పల్నాడు జిల్లాలోని పురపాలికల్లో ‘ఛైర్మన్’ పదవుల్లో పోటీకి నేతలు వెనుకంజ వేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకి మారిన అవరోధాలన్ని తొలగి పోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు ఎదురైన న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. పలు నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన దాదాపు 50 పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి మార్గం సుగమమైంది. ఉన్నత న్యాయస్థానం క్లియరెన్స్ ఇవ్వడంతో.. త్వరలోనే కొత్తగా పునర్విభజించిన వార్డుల ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఖర్చు.. వెన్నులో వణుకు:
గతంలో పరోక్ష ఎన్నికల విధానం ఉన్నప్పుడు కేవలం వార్డు కౌన్సిలర్లను ప్రసన్నం చేసుకుంటే సరిపోయేది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండి, పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను క్యాంపులకు తరలిస్తే చైర్మన్ పీఠం దక్కేది. దీనివల్ల ఖర్చు కూడా పరిమితంగానే ఉండేది. కానీ ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల విధానంలో మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ వార్డు, ప్రతీ గల్లీలో ఉన్న ప్రతి ఓటరునూ నేరుగా ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దాదాపు అసెంబ్లీ ఎన్నికల స్థాయి ప్రచారం, వ్యయంతో సమానంగా మారింది. ఓటర్ల సంఖ్య భారీగా ఉండటంతో ఒక్కో మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు మంచి నీళ్లలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి రిస్క్ చేయడం అవసరమా అన్న భావన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది.
అవిశ్వాస తీర్మానాలకు చెక్.. కానీ గెలిస్తే వచ్చేదేంటి?:
చట్ట సవరణల ద్వారా ఒకసారి ఎన్నికైన చైర్మన్లపై సులువుగా అవిశ్వాస తీర్మానం పెట్టే వీలు లేకుండా ప్రభుత్వం పటిష్టమైన చట్టభద్రత కల్పించిన మాట వాస్తవమే. పదవికి ఢోకా ఉండదన్న భరోసా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పారదర్శక పాలన, ఆన్లైన్ టెండర్లు, కఠినమైన నిబంధనల నడుమ పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడం కల్ల అని నేతలు భావిస్తున్నారు. “కోట్లు కుమ్మరించి గెలిచినా.. అభివృద్ధి పనుల్లో పైసా మిగలదు, చివరకు ప్రజా సమస్యల ఒత్తిడి, పార్టీల అంతర్గత కుమ్ములాటలే మిగులుతాయి” అని కొందరు నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ప్రజాసేవ కంటే ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భావించే నాయకులు ఈ పదవులంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
కౌన్సిలర్ అయితే సేఫ్..
ప్రస్తుతం పట్టణాల్లో ద్వితీయ శ్రేణి నాయకులంతా ఒకటే మంత్రం జపిస్తున్నారు. “మున్సిపల్ చైర్మన్ పదవి కంటే వార్డు కౌన్సిలర్ పదవే వెయ్యి రెట్లు నయం” అనే భావన వారిలో బలపడింది. వార్డు పరిధి చిన్నదిగా ఉండటం, ఖర్చు లక్షల్లోనే సరిపోతుండటంతో కౌన్సిలర్ టికెట్ కోసం పోటీ పడుతున్నారే తప్ప.. చైర్మన్ రేసులోకి వెళ్లేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. పెద్ద తలకాయలంతా సైలెంట్ అయిపోవడంతో, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది.
పార్టీ ఇన్చార్జులకు తలనొప్పిగా మారిన ఎంపిక…
అధికార కూటమి పార్టీలతో పాటు, పట్టు నిలుపుకోవాలని చూస్తున్న వైఎస్సార్సీపీకి కూడా బలమైన, ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థులను వెతకడం పెను సవాలుగా మారింది. ఎవరి పేరైనా ప్రతిపాదిస్తే.. “నాకొద్దు బాబోయ్.. ఆర్థికంగా అంత భారం నేను మోయలేను” అంటూ నేతలు సున్నితంగా తిరస్కరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరు నాయకులైతే టికెట్ ఇస్తారేమోనన్న భయంతో పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్న వైనం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కోర్టు అడ్డంకులు తొలగి ఎన్నికల మార్గం సుగమమైనా.. పోటీ చేసేందుకు ‘సత్తా’ ఉన్న అభ్యర్థులు దొరక్క పార్టీల అధిష్టానాలు తలలు పట్టుకుంటున్నాయి.
ఓవైపు అధికారులు ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ప్రక్రియను వేగవంతం చేస్తూ పోరుకు గ్రౌండ్ సిద్ధం చేస్తుండగా.. మరోవైపు పార్టీ అధిష్టానాలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఆర్థిక స్థోమత ఉన్న బలమైన అభ్యర్థులను ఛైర్మన్ రేసులో నిలబెట్టడం పల్నాడు జిల్లా నాయకులకు పెను సవాలుగా మారేలా కనిపిస్తోంది.
