ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

పోలీసుల సేవలు ప్రశంసనీయం
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

నర్సాపురం, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. స్థానిక వైఎన్‌ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. నామినేషన్‌ ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించామని తెలిపారు. అనుమానితులు, సంఘవిద్రోహ శక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా మెరుగైన సేవలు అందించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. అర్ణబ్‌ తుఫాన్‌ సమయంలోనూ పోలీసులు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని తెలిపారు. మురసు తుఫాన్‌ నేపథ్యంలో నేడు, రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న మండల పరిషత్‌ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును విస్తృతం చేసి, స్థానిక ఎన్నికలను ప్రజల సహాయ సహకారాలతో విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నర్సాపురం డీఎస్పీ మేకా సుధాకర్‌రావు, పట్టణ సీఐ ఆకుల రఘు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.