Municipal|మున్సిపల్ ముచ్చట్లు…

Municipal|మున్సిపల్ ముచ్చట్లు…

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న పోలింగ్
మున్సిపాలిటీలో 52 లక్షల మందికి పైగా ఓటర్లు
వాయిదా పడిన నారాయణపేట జిల్లా మక్తల్ మక్తల్ మున్సిపాలిటీ
సొంత జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజానేతలు

Municipal| ఆంధ్ర ప్రభ, వెబ్ డెస్క్ః తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పురుషులు 25,49,750, మహిళలు 26,67,025, మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం ఎన్నికల అధికారులు కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

ఈ ఎన్నికల నిర్వహణ కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్పులను ఎస్‌ఈసీ వెబ్‌సైట్ లేదా TE-POLL యాప్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,981 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సమస్యాత్మకమైన కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు.

ఏ పార్టీ నుంచి ఎంతమంది…

116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ జరగనుంది. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వార్డులో పోలింగ్‌ను వాయిదా వేశారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి 410, బీఆర్ఎస్ నుంచి 401, బీజేపీ నుంచి 382 మంది సహా మొత్తం 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లలో రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కార్పొరేషన్ల పరిధిలో 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గ కొడంగల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కోమట్టి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నీలగిరిలోని 33వ వార్డులో ఓటు వేశారు. మంచిర్యాలలోని హైటెక్‌సిటీలో మంత్రి వివేక్‌ ఓటు వేశారు. కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జోగిపేటలోని 9వ వార్డులో మంత్రి దామోదర రాజనర్సింహ, హుస్సాబాద్ 11వ వార్డులో మంత్రి పొన్నం ప్రభాకర్, మంచిర్యాల జిల్లా హైటెక్ సీటీలో ఓటు వేసిన మంత్రి వివేక్ వెంటస్వామి, నిజామాబాద్ జిల్లా 47వ డివిజన్ లో ఓటేసిన టీపీసీసీ మహేష్ కుమార్ గూడ్, వినాయక్ నగర్ లో ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్‌ 50వ డివిజన్‌ పరిధిలోని జ్యోతినగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రికత్తలు …

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టాడని సీఐ పై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ శివకుమార్ ను వదిలేదని హెచ్చరించారు.పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి దుసుకెళ్లారు. మరో పక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఘర్షణలు. మహబూబాబాద్ లో 14 వ వార్డు వద్ద ప్రచారం చేస్తున్నాడని కాంగ్రెస్ అభ్యర్ఠిపై బీఆర్ఎస్ అభ్యర్థి దాడి చేశారు. భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలోని 31వ వార్డులో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం, వరంగల్‌లోని నర్సంపేట పరిధి 24వ వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్, వికారాబాద్‌లోని పరిగిలో 13వ వార్డు 27వ పోలింగ్‌ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు వారి చెదరగొట్టారు.

Leave a Reply