ములుగు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా (Mulugu District) లోని పసర తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ గుండ్లవాగు వరద ఉదృతిని ఇవాళ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) నిన్నటి నుండి కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు.
జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, జిల్లా ప్రజలకు అందుబాటులో ములుగు కలెక్టరేట్ (Collectorate) టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కాల్ చేయాలని మంత్రి సీతక్క ప్రజలను కోరారు.
రైతులు (Farmers) ముఖ్యంగా విద్యుత్ షాక్ ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రతగా ఉండాలని, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, జాలరులు చేపల వేటకు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, కింది స్థాయి అధికారులతో మానిటరింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
