అమర వీరుల త్యాగాల వలనే ఎస్సి వర్గీకరణ

అమర వీరుల త్యాగాల వలనే ఎస్సి వర్గీకరణ
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణ
దండేపల్లి, ఆంధ్రప్రభ : మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగారపు మురళికృష్ణ మాదిగ పేర్కొన్నారు.
ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 30 ఏళ్ల పాటు నిరంతర పోరాటం కొనసాగించారని, అమరవీరుల త్యాగాల వల్లే వర్గీకరణ సాధ్యమైందన్నారు. రాజ్యాంగం ప్రకారం భవిష్యత్ తరాలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మండల ఇంచార్జి తగరపు సత్యం మాదిగ, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా కో-కన్వీనర్ కొల్లూరి రవికుమార్ మాదిగ, మండల సీనియర్ నాయకులు కొల్లూరి రమేష్ మాదిగ, ముల్కళ్ల వినోద్, బోనగిరి అనిల్, ముల్కళ్ల యశ్వంత్, అజయ్, బొమ్మేన పవన్, జితేందర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
