పోలవరం జిల్లాలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్
తొలి రెండు గంటల్లో 12.26 శాతం ఓటింగ్.. 368 కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
పోలవరం, ఆంధ్రప్రభ బ్యూరో: పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 368 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లోనే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జిల్లాలో 12.26 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 180 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లా ఎస్పీ చక్రవర్తి వివిధ పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శిస్తూ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సా. 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అర్హులైన ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
