ఎక్సైజ్ కమిషనరేట్‌ను తరలిస్తే ఉద్యమం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి అన్నారు. బుధవారం కటమంచి లాయర్స్ కాలనీలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం ఎక్సైజ్ కమిషనరేట్‌ను కూడా తరలించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. చిత్తూరు నుంచి ఏ కార్యాలయాన్ని తరలిపోకుండా చూస్తానని హామీ ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధి.. కార్యాలయాల తరలింపుపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు కార్యాలయాల తరలింపునకు జీవో ఇచ్చినప్పటికీ, దాన్ని ఉపసంహరించేందుకు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నాలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. కార్యాలయాల తరలింపు అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్యే గురజాలను ప్రశ్నించారు. చిత్తూరులోని పలు కార్యాలయాలను తిరుపతికి తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.
మాట నిలబెట్టుకోలేని గురజాల
కార్యాలయాల తరలింపుపై ఎమ్మెల్యే గురజాల ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని విజయానందరెడ్డి విమర్శించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించనందుకు చిత్తూరు ప్రజలు ఎమ్మెల్యేను చరిత్రహీనుడిగా నిలబెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు వేయడం మాత్రమే కాదన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఖర్చు చేయాల్సిన రహదారి నిధులను కమిషన్ల కోసం మున్సిపాలిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారానికి వినియోగించాల్సిన మున్సిపల్ నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
ఎక్సైజ్ కమిషనరేట్‌ను చిత్తూరులోనే కొనసాగించకపోతే మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు, నాయకులు, మేధావులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని విజయానందరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
