మోటూరులో ఇంటి చోరీ కేసు ఛేదింపు

రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
నిందితుడి అరెస్ట్‌.. 48.014 గ్రాముల బంగారం రికవరీ

గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ మండలం మోటూరు గ్రామంలో ఇంటి బీరువా లాకర్‌ను పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మోటూరు గ్రామానికి చెందిన తాడిపర్తి అశోక్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి, రూ.4.20 లక్షల విలువైన 48.014 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ రూరల్‌ సీఐ ఎస్‌.ఎల్‌.ఆర్‌. సోమేశ్వరరావు తెలిపారు. గుడివాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మోటూరుకు చెందిన గండికోట శివపార్వతి ఇంటిలో బీరువా లాకర్‌ను పగులగొట్టి బంగారు ఆభరణాలు అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌డీపీవో పాలా శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మోటూరు, పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టగా లభించిన ఆధారాల ఆధారంగా అశోక్‌కుమార్‌ను నిందితుడిగా గుర్తించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడి వద్ద, అతని ఇంటి నుంచి బంగారు చైన్‌, బ్రాస్లెట్‌తో పాటు తాకట్టు పెట్టిన మరికొన్ని బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మొత్తం 48.014 గ్రాముల బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.4.20 లక్షలు ఉంటుందని వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన రూరల్‌ ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు, సీసీఎస్‌ ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. వారి పనితీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రివార్డుకు సిఫారసు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.