అధ్వానంగా ఆర్ అండ్ బి రోడ్లు..

  • ప్రయాణం చేయాలంటే నరకయాతనే
  • ఆర్ అండ్ బి అధికారులు ఉన్నట్లా లేనట్లా
  • నిత్యం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ప్రయాణికులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఉట్నూర్ పరిధిలోని ప్రధాన రహదారుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు, ప్యాచ్‌వర్క్ పనులు కూడా చేపట్టకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీర్సాయిపేట్‌ వద్ద అధ్వానంగా..

ఉట్నూర్‌ నుంచి మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారి ఉట్నూర్‌ నుంచి బీర్సాయిపేట్‌ వరకు పలుచోట్ల గుంతలమయంగా మారింది. ముఖ్యంగా బీర్సాయిపేట్‌ సమీపంలో కిలోమీటరుకు పైగా రహదారి పెద్దపెద్ద గుంతలతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకయాతనగా ఉందని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌అండ్‌బీ శాఖపై అసంతృప్తి

రోడ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు కనీసం గుంతలను పూడ్చే ప్యాచ్‌వర్క్‌ పనులు కూడా చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్ల నిర్వహణ విషయంలో శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సమస్యను పట్టించుకోవడం లేదని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హస్నాపూర్‌–నార్నూర్‌ చౌరస్తా వరకు..

ఉట్నూర్‌ నుంచి హస్నాపూర్‌, నార్నూర్‌ చౌరస్తా వరకు కూడా పలుచోట్ల రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణించే వారు గుంతల కారణంగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్సులు గుంతల్లో దిగినప్పుడు కుదుపులకు గురవుతున్నాయని, ప్రయాణ సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.

ప్యాచ్‌వర్క్‌ అయినా చేపట్టాలి

కొత్త రహదారులు నిర్మించకపోయినా కనీసం గుంతలు పడ్డ ప్రాంతాల్లో ప్యాచ్‌వర్క్‌ పనులు చేపట్టి రోడ్లను ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడి రహదారుల పరిస్థితి ఇలాగే ఉన్నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమని వారు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.