రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం.. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాని భూవివాదం
పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చిన రైతు దంపతులు
అడ్డుకున్న అధికారులు

మోత్కూరు, ఆంధ్రప్రభ : రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూసమస్య పరిష్కారం కోసం ఎనిమిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఓ రైతు ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన రైతు మడూరి నారాయణరెడ్డి, నీలమ్మ దంపతులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రైతు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తమ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యపై గత ఎనిమిదేళ్లుగా రెవెన్యూ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని పూర్తిగా ఆక్రమించుకొని, తనను కూడా అందులోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు ఇద్దరు కుమార్తెలేనని, బతుకుదెరువు కోసం బయటకు వెళ్లి వచ్చేసరికి తన భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చిన రైతు దంపతులు వినతిపత్రం అందజేసిన అనంతరం బ్యాగులో నుంచి పురుగుల మందు డబ్బాను బయటకు తీశారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయన నుంచి డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నోడల్‌ అధికారి బాలాజీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ తదితరుల సమక్షంలో కార్యాలయ ఆవరణలో గుంత తీసి గడ్డిమందును నిర్వీర్యం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూవివాదంపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని రైతు దంపతులు విన్నవించారు.