ఏజెన్సీలో భర్తను హతమార్చిన భార్య
కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మోతుగూడెం (చింతూరు), ఆంధ్రప్రభ : పోలవరం (రంపచోడవరం) జిల్లా చింతూరు ఏజెన్సీలో భార్య భర్తను హతమార్చిన ఘటన మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గుడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దబ్బగూడెం గ్రామానికి చెందిన జల్లి లక్ష్మణరావు (40)ను భార్య జల్లి భద్రమ్మ హతమార్చినట్లు తెలిపారు.
లక్ష్మణరావు వ్యవసాయం చేస్తుండగా, భద్రమ్మ అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు తలెత్తి కుటుంబ కలహాలకు దారితీశాయని సీఐ తెలిపారు. తరచూ గొడవలు పడేవారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కూడా భార్యాభర్తల మధ్య ప్రారంభమైన గొడవ తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భద్రమ్మ కర్రతో లక్ష్మణరావుపై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు వివరించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సమాచారం అందుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్సై నాసీర్ హుస్సేన్ పోలీసు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
