Mothkur | ఓటర్ల జాబితా, ప్రచురణ పారదర్శకంగా నిర్వహించాలి

Mothkur | ఓటర్ల జాబితా, ప్రచురణ పారదర్శకంగా నిర్వహించాలి
- స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీకి సంబంధించి అన్ని వార్డుల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్, మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్ ను ఆదేశించారు. ఇవాళ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 12 వార్డులలోని 25 పోలింగ్ కేంద్రాల వారీగా తయారు చేస్తున్న ఓటర్ల జాబితాను అడిషనల్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఓటర్ల నమోదులో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 30న పోలింగ్ స్టేషన్ల వారీగా డేటాను తిరిగి అమర్చాలని, 31న వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల సమాచారాన్ని పునర్వ్యవస్థీకరించి, అదేరోజు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల రోల్స్‌లో డేటాను చేర్చాలని సూచించారు. జనవరి 1న పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలను స్వీకరించి, అనంతరం నోటీసు బోర్డులపై పోలింగ్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశించారు.
జనవరి 5న మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలన్నారు. 6న జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారుల సమీక్ష అనంతరం జనవరి 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్ కి సూచించారు.
