Breaking News | ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య..

Breaking News | ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య..

బావిలో దూకిన తల్లి, కుమార్తె మృతి..
కుమారుడి కోసం గాలింపు


Breaking News | వికారాబాద్‌, అక్టోబర్‌ 3 (ఆంధ్రప్రభ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకిన విషాద ఘటన వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మాటుగూడలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందగా.. కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

స్థానికుల కథనం ప్రకారం.. మాటుగూడకు చెందిన మమత (30) శుక్రవారం ఉదయం భర్త రాజుతో గొడవపడింది. అనంతరం తన కుమార్తె జనశ్రీ (8), కుమారుడు సాకేత్‌ (4)ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత సోమన్‌పూర్తి శివారులోని వ్యవసాయ బావిలో ముగ్గురూ పడిపోయినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు బావి వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. మమత, జనశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. కుమారుడు సాకేత్‌ ఆచూకీ ఇంకా లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు కుటుంబ కలహాలే కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.