ప్రజా సేవలలో మరింత పురోగతి సాధించాలి

జిల్లా కలెక్టర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: పారిశుధ్య నిర్వహణ, సంక్షేమ పాఠశాలల విభాగంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి అగ్రస్థానాల్లో నిలవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొనియాడారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆయా మండలాల అధికారులతో మాట్లాడారు. పారిశుధ్య నిర్వహణలో 73.8 స్కోరుతో జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 76.90 పాయింట్లతో 3వ స్థానం, చిన్నారుల సంరక్షణలో 84.3 స్కోరుతో 5వ స్థానంలో నిలిచాయని వెల్లడించారు. మిగిలిన రంగాలు, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలోనూ మెరుగైన ఫలితాలు సాధించి మరింత పురోగతి సాధించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ కింద ఈ-పంట నమోదును వంద శాతం పూర్తి చేయాలని, అర్హులైన రైతులందరినీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు.

పాలనలో పారదర్శకత కోసం ఇ-ఆఫీస్ విధానాన్ని వంద శాతం అమలు చేయాలని, భౌతిక ఫైళ్ల కదలికను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో గడువు దాటిన పిటిషన్లను 0.5 శాతం లోపునకు తీసుకురావాలని స్పష్టం చేశారు. వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు దోమల నివారణకు పొగ విసిరే యంత్రాల వినియోగాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకులలో వంద శాతం క్లోరినేషన్ పూర్తి చేసి, నీటి నమూనాలను క్రమం తప్పకుండా ల్యాబ్ పరీక్షలకు పంపాలని ఇంజనీరింగ్ అధికారులను నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి ప్లాంట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో 6 నుండి 36 నెలల చిన్నారులకు అందించే పాలు, గుడ్ల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు .