రైతుల పక్షపాతి మోదీ.. బండి సంజయ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) రైతుల పక్షపాతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్(Thimmapur) మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ డైరీలో రూ.90.70 కోట్లతో నిర్మించిన ఆటోమేటిక్ కర్డ్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు ఆకాశన్ని అంటుతున్నా ధరలు పెంచకుండా ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తూ సబ్సిడీ(Subsidy) ధరకే యూరియాను అందిస్తున్నామన్నారు.
దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఈరోజు రూ.42 వేల కోట్ల విలువైన అనేక పథకాలను ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేసి 1 కోటి 70 లక్షల మంది రైతులను అన్ని విధాలా ఆదుకుని లాభాలు కలిగించేందుకే ఈ స్కీంను అమలు చేయడం ఆనందంగా ఉంది. అదే విధంగా తెలంగాణ జిల్లాలు గద్వాల్, నారాయణపేట(Narayanapet), నాగర్ కర్నూలు, జనగాంలలో నేటి నుండి అమలవుతుందన్నారు. ఏటా 24 వేల కోట్ల చొప్పున 6 ఏండ్ల పాటు నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు.
రాజేశ్వరరావు వల్లే డైరీ అభివృద్ధి
రాజేశ్వరరావు అంటే ఎవరూ గుర్తుపట్టరు. కానీ కరీంనగర్ డెయిరీ రాజేశ్వర్ రావు అంటే అందరికీ సుపరిచితులే. కరీంనగర్ డెయిరీని కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడంవల్లే ఆయనకు ఆ పేరు వచ్చింది. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డెయిరీ) 27 ఏళ్ల చరిత్ర ఉంది. పాల వ్యాపారంలోకి వచ్చి కోఆపరేటివ్ యూనియన్(Cooperative Union) అధ్యక్షుడిగా ఎన్నికై కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ 2012లో ఏర్పాటు చేసి ప్రతిరోజు 2 లక్షల లీటర్ల పాలను సేకరించడంతోపాటు 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయించడం మామూలు విషయం కాదు. 600 మందికి ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు లక్ష మంది పాడి రైతుల నుండి పాలను కొనుగోలు చేసి వారి జీవితాలకు భరోసా ఇస్తున్న సంస్థ యాజమాన్యానికి నా హ్రుదయ పూర్వక అభినందనలు.
డైరీ అభివృద్ధికి కేంద్ర సహకారం
మోదీ ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు అండగా ఉంటుంది. కరీంనగర్ డెయిరీ పనితీరును చూసి మోదీ ప్రభుత్వం 2021లోనే 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సాయం అందించింది. ప్రధాన మంత్రి ధన-ధాన్య(Dhana-Dhana) కృషి యోజనలో భాగంగా జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ ఆర్ధిక సహకారంతో 90 కోట్ల 70 లక్షల 94 వేల రూపాయల వ్యయంతో 1 లక్షా 50 వేల లీటర్ల పెరుగు కేంద్రం ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఈ సంస్థపట్ల కేంద్రానికి ఉన్న నిబద్దతకు నిదర్శనం.
డైరీ ప్రొడక్ట్స్ ఆపేందుకు కుట్ర
కరీంనగర్ డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నట్లు నా ద్రుష్టికి వచ్చంది. నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను. కరీంనగర్ డెయిరీ ప్రొడక్ట్స్(Products) ను ఆపొద్దని, మరింతగా విస్తరిస్తూ ప్రజలకు సేవలందించేలా చూడాలని కోరుతున్నా.
