Modi-Intervention : సలామ్.. దోస్తానా Andhra Prabha Top Story
Modi-Intervention : సలామ్.. దోస్తానా Andhra Prabha Top Story
- పీఎం మోదీ జోక్యం .
- ఎమ్మెల్యే యూటర్న్
- 16 ఏళ్ల భూవివాదానికి తెర
- చిన్ననాటి స్నేహితుడికి నయా తోఫా
- ఇదొక భయందర్ రియల్ స్టోరీ
(ఆంధ్రప్రభ, ముంబై )
:
మోదీ జోక్యంతో 81 ఏళ్ల చిన్ననాటి స్నేహితుడికి భూమి తిరిగి దక్కింది.
దశాబ్దాల భూ వివాదానికి తెర ఐడింది. తన ఆదీనంలోని భైమిని బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తిరిగి అప్పగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి పాఠశాల స్నేహితుడు, 81 ఏళ్ల అస్గర్ అలీ వోరాకు మహారాష్ట్రలోని మీరా-భయందర్‌లో వివాదాస్పద భూమి తిరిగి దక్కింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదంపై ప్రధాని మోదీని కలిసి జోక్యం చేసుకోవాలని వోరా కోరిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వివాదాస్పద స్థలంపై తను స్వాధీన హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతులను కూడా తిరిగి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదరడంతో వోరాపై తాను చేసిన పోలీసు ఫిర్యాదును కూడా ఉపసంహరించుకున్నట్లు మెహతా వెల్లడించారు.
1989లో భూమి కొనుగోలు
తాను 1989లో భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసినట్లు వోరా తెలిపారు. ఆ భూమిని తాను ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని ఆయన పేర్కొన్నారు. 2011లో తనకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించారని, అనంతరం ఆస్తిని రెండు భాగాలుగా విభజించారని వోరా ఆరోపించారు.
నిర్మాణ సంస్థలపై ఆరోపణలు
వోరా వాదన ప్రకారం.. భూమిలోని ఒక భాగం స్వయం బిల్డర్స్ ఆధీనంలో ఉన్నట్లు పత్రాల్లో చూపించారు. మరో భాగాన్ని మెహతాతో సంబంధం ఉన్న సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్‌కు అనుసంధానించారు. తన యాజమాన్య హక్కుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ.. మీరా-భయందర్ మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆ స్థలంలో నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిందని కూడా వోరా ఆరోపించారు.
ప్రధాని మోదీకి వినతితో.. .
ఈ వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ వోరా ప్రధాని మోదీని కలిశారు. 1989లో తాను కొనుగోలు చేసిన భూమి విషయంలో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.ఆ భేటీ జరిగిన కొద్దిరోజులకే వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థలంపై తన స్వాధీనాన్ని వదులుకోవడంతో పాటు, నిర్మాణ అనుమతులను తిరిగి ఇచ్చేందుకు నరేంద్ర మెహతా అంగీకరించారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన రాజీ ప్రకారం పోలీసు ఫిర్యాదును కూడా ఉపసంహరించుకున్నారు. దీంతో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి ప్రస్తుతానికి పరిష్కారం లభించినట్లయింది.
