MM Somaya | నా ఒలింపిక్‌ గోల్డ్ మెడల్ పోయింది.. మాజీ హకీ కెప్టెన్‌ ఇంట్లో చోరీ!

  • ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డీకే శివకుమార్‌కు లేఖ
  • మరో మూడు అంతర్జాతీయ పతకాలూ చోరీ

బెంగళూరు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: భారత మాజీ హాకీ కెప్టెన్ ఎం.ఎం. సోమయ ఇంట్లో దొంగలు చొరబడి విలువైన వస్తువులతో పాటు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌కు లభించిన స్వర్ణ పతకాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన సోమయ.. తన పతకాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లేఖ రాశారు. అక్టోబర్‌ 28న తెల్లవారుజామున 2.34 గంటల సమయంలో బెంగళూరులోని న్యూ తిప్పసంద్రలో ఉన్న ఆయన నివాసంలో ఈ చోరీ జరిగినట్లు సమాచారం. ఒలింపిక్‌ స్వర్ణ పతకంతో పాటు మరో మూడు అంతర్జాతీయ క్రీడా పతకాలను కూడా దొంగలు తీసుకెళ్లారు.

నాలుగు అంతర్జాతీయ పతకాలు మాయం

దొంగిలించబడిన వాటిలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ స్వర్ణ పతకం, 1982 ఢిల్లీ ఆసియా క్రీడల రజత పతకం, 1986 సియోల్‌ ఆసియా క్రీడల కాంస్య పతకం, 1982 ఆమ్‌స్టర్‌డామ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కాంస్య పతకం ఉన్నాయి. వీటితో పాటు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.30 వేల నగదును కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.3.53 లక్షలుగా అంచనా వేశారు. వాటిలో 10 గ్రాముల బంగారు గాజు, 8 గ్రాముల బంగారు నాణెం, 144 గ్రాముల బరువున్న రెండు వెండి కప్పులు, ఆరు వెండి చెంచాలు, 80 గ్రాముల వెండి పాత్ర ఉన్నాయి.

సీసీటీవీలో ఇద్దరు అనుమానితులు

అక్టోబర్‌ 28న ఉదయం 7.15 గంటల సమయంలో ఇంటి ముందు తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు సోమయకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కింట్లోని సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడిన దృశ్యాలు నమోదయ్యాయి. వారిలో ఒకరు నీలం రంగు చొక్కా, మరొకరు ఎరుపు రంగు చొక్కా ధరించినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘ఆ పతకం దేశ క్రీడా చరిత్రకు గుర్తు’

తన ఒలింపిక్‌ స్వర్ణ పతకం ప్రాముఖ్యతను వివరిస్తూ సోమయ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ పతకం కేవలం తన వ్యక్తిగత విజయానికి గుర్తు మాత్రమే కాదని, ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశానికి దక్కిన గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. 1980లో భారత పురుషుల హాకీ జట్టు సాధించిన ఒలింపిక్‌ స్వర్ణం.. ఇప్పటివరకు ఆ విభాగంలో భారత్‌కు దక్కిన చివరి స్వర్ణ పతకం. ఎన్నో ఏళ్ల కృషి, త్యాగం, దేశానికి చేసిన సేవకు ఆ పతకం గుర్తుగా నిలిచిందని సోమయ తెలిపారు. దాన్ని తిరిగి రాబట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించాలని కోరారు.

ఈ ఘటనపై ఇందిరానగర్‌ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి, చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తూర్పు విభాగం డీసీపీ విక్రమ్‌ ఆమ్టే వెల్లడించారు.

మూడుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం

ఎం.ఎం. సోమయ 1980 మాస్కో ఒలింపిక్స్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1984 లాస్‌ ఏంజెల్స్‌, 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సియోల్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. తన కెరీర్‌లో రెండు ప్రపంచకప్‌లు, రెండు ఆసియా క్రీడలు, రెండు ఆసియా కప్‌లు, మూడు ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. భారత హాకీకి చేసిన సేవలకు గుర్తింపుగా 1985లో అర్జున అవార్డును అందుకున్నారు.